SKANDA స్కంద… నాన్ స్టాప్ నరుకుడు

Skanda Movie review
Love to Share

‘స్కంద’ సినిమా రివ్యూ – Movie Review Skanda

నటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ

దర్శకుడు: బోయపాటి శ్రీను

సినిమా శైలి: Telugu, Action, Drama

వ్యవధి: 2 Hrs 47 Min

‘స్కంద’లో డ్యుయెల్ రోల్ ఫార్ములాని రిపీట్ చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. అదే అదే అదే కథ, కథనం, క్లైమాక్స్.

అయితే ఈసారి ప్రాబ్లమ్ హీరోకో.. హీరోయిన్ ఫ్యామిలీకో కాదు. హీరో స్నేహితుడుకి. ‘స్కంద’ కథని ఈసారికి అలా ‘నరుక్కుంటూ’ వచ్చాడు బోయపాటి.
ఆంధ్రా సీఎం కూతుర్ని తెలంగాణ సీఎం కొడుకు లేపుకుని పోవడంతో ‘స్కంద’ కథ మొదలౌతుంది. ఆంధ్రా సీఎం అంటే జగనూ.. తెలంగాణా సీఎం అంటే కేసీఆర్ కాదండోయ్ బోయపాటి కథలో ఇక్కడ ఇద్దరు సీఎంలు విలన్లన్నమాట. తన కూతుర్ని లేపుకునిపోవడంతో తెలంగాణ సీఎం కొడుకుని లేపేయడానికి ఆంధ్రా సీఎం స్కెచ్‌లు వేస్తుంటాడు. ఈ ప్రాసెస్‌లో ధీరుడు వీరుడు సూరుడైన స్కంద (రామ్ పోతినేని)కి తన కూతుర్ని తీసుకొచ్చే బాధ్యతని అప్పగిస్తాడు ఆంధ్రా సీఎం. అయితే స్కంద ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా అటు ఆంధ్రా సీఎం కూతుర్నీ ఇటు తెలంగాణ సీఎం కూతురు (శ్రీలీల) లేపుకుని తన సొంత ఊరు రుద్రరాజ పురానికి తీసుకుని వస్తాడు. ఈ ఇద్దరు సీఎంలకు ఈ రుద్రరాజపురానికి లింక్ ఏంటన్నది ఒక ట్విస్ట్ అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.

రుద్ర రాజపురానికి పెద్ద మణికంఠరాజు (దగ్గుబాటి రాజా) మణికంఠ రాజు కొడుకే స్కంద. అలాగే మణికంఠ రాజు ప్రాణ స్నేహితుడే రుద్రగంటి రామకృష్ణ రాజు (శ్రీకాంత్) ఇతను క్రౌన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవోగా ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ ఇద్దరు సీఎంలు అక్రమ కేసులో ఇరికించి ఉరి కంభం ఎక్కించబోతారు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం.. రామకృష్ణ రాజుని అతని కుటుంబాన్ని ‘స్కంద’ ఎలా కాపాడగలిగాడు. ఆ ఇద్దరు సీఎంలను ఎలా మట్టుపెట్టాడు అన్నదే మిగిలిన కథ.

బోయపాటి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధానంలో వ్యవస్థని లేక్కేచేయడు. వాస్తవానికి దూరంగా వ్యవస్థలతో ఆటాడేస్తుంటాడు. ఏంటీ ఇలా కూడా చేయొచ్చా అనే ప్రశ్నలు వస్తుంటాయి కానీ బోయపాటి మాత్రం అందంతా డోన్ట్ కేర్ వెయ్ నా కొడుకుని వెయ్ అని ఆడియన్స్‌తో అనిపించామా లేదా అన్నదే ముఖ్యం. హీరో ఒక్క గుద్దికి విలన్లను చంపేస్తుంటాడు కానీ విలన్లు బులెట్ల వర్షం కురిపిస్తున్నా కూడా హీరో రొమ్మునిక్కబొడిచి మరీ దూసుకొచ్చేస్తుంటాడు అతనికి ఏం కాదు.. దటీజ్ బోయపాటి. ఈ సినిమాలో అయితే ఏకంగా సీఎంలనే రంగంలోకి దింపేశాడు. ఏదో సర్పంచ్ ఇంటికెళ్లినట్టు హీరో గేట్లను తన్నుకుని సీఎం ఇళ్లకి వెళ్లిపోవడం వాళ్ల కూతుర్లను లేపుకుని వచ్చేయడం లాంటి సీన్లు చూస్తే దీనమ్మా జీవితం బోయపాటీ ఇది నీకే చెల్లిందయ్యా అనేట్టుగానే ఉంటుంది.

భద్ర నుంచి అఖండ వరకూ బొయపాటు తొమ్మది సినిమాలు తీస్తే అందులో ఆరు బ్లాక్ బస్టర్ హిట్స్. అదీ బోయపాటి మార్క్ అంటే. ఆరంభంలో హ్యాట్రిక్ విజ‌యాలు న‌మోదు చేసిన ఘ‌న‌త బోయపాటికే దక్కింది. అవి కూడా అలాంటి ఇలాంటి హిట్స్ కాదు మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన ఊర మాస్ చిత్రాలవి. అయితే స్కంద సినిమాలోనూ అదే స్థాయి మాస్ ఫీస్ట్ అందించే ప్రయత్నం చేశారు బోయపాటి. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో బోయపాటి మార్క్ మాస్ ఆడియన్స్‌తో వీరంగం చేయిస్తాయి. కమర్షియల్ కిటుకులు బాగా తెలిసిన బోయపాటి మాస్ ఆడియన్స్‌కి గాలం వేయడంలో దిట్ట. అయితే స్కందలో కనిపించే ఊచకోత మాత్రం మాస్ ఆడియన్సే వామ్మో అనేట్టు చేశారు.

అదేందో కానీ హీరో విలన్లు కొట్టుకుచావడం అటుంచితే అటు ఇటూ మధ్యన ఉన్న వాళ్లని ఓ రెండు మూడు వందల మందిని తక్కువ కాకుండా ఊచకోత కోయించేశాడు బోయపాటి. కసకసా నరుకుడు టపాటపా పేల్చుడు సినిమా నిండా చావులు.. రక్తపాతం ఏరులైపారింది. జేబులో బఠాణీలు వేసుకుని సరదాకి నమిలినట్టుగా విలన్లను ఊచకోత కోసేశాడు రామ్. ‘చావు సారాయి తాగి నాట్యం చేస్తే ఎట్టా ఉంటాదో అట్టా నరుకుతున్నాడ్రా’ అనేట్టుగా ఉగ్రరూపం దాల్చాడు రామ్. అటు తెలంగాణ, ఇటు రాయసీమ యాసల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించాడు రామ్. యాక్టింగ్ పరంగా రామ్‌కి పేరు పెట్టలేం. బోయపాటి చెప్పింది చేసుకుంటూ నరుక్కుంటూ పోయాడంతే.

‘స్కంద’ మాస్ ఆడియన్స్ వరకూ ఓకే మరి నెక్స్ట్ ఏంటి? అంటే ఇంకేం లేదు ఇందులో చెప్పుకోవడానికి. బోయపాటి సినిమాల్లో హీరో ఆవేశం వెనుక బలమైన కారణం ఉంటుంది. హీరో నరుకుతుంటే వెయ్ నా కొడుకుని వెయ్ అన్నట్టుగా ఆడియన్స్‌లోనే వీరావేశం నింపుతాడు బోయపాటి. ఇంకా నరికితే బాగుండన్నట్టుగా బలమైన సన్నివేశాలు ఉంటాయి. ‘స్కంద’ లో బలమైన భావోద్వేగ సన్నివేశాలు లేకపోవడమే ప్రధాన లోపంగా కనిపిస్తుంది. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ పడే వరకూ హీరో ఎందుకు నరుకుతున్నాడన్నదానికి సరైన కారణమే కనిపించదు. కథ మొత్తం సెకండాఫ్‌లో రివీల్ కావడంతో హీరో చేతిలో చంపబడుతున్న వాళ్లని చూస్తే పాపం అనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్లో. ఇద్దరు విలన్లను ఎంపీగానే ఎమ్మెల్యేగానో పోనీ మంత్రిగానో చూపిస్తే నష్టం ఏమొచ్చేదో తెలియదు కానీ.. ఏకంగా రెండు రాష్ట్రాలకు సీఎంలుగా చూపించి పెద్ద సాహసమే చేశారు బోయపాటి. సీఎంల ఇళ్లకి వెళ్లి.. వాళ్ల కూతుళ్లను ఎత్తుకొచ్చేయడం అంత ఈజీనా? అనే సందేహం రాలేదో ఏమో కానీ ట్రాక్టర్ వేసుకుని వెళ్లి మరీ హీరో డిష్యుం డిష్యుం ఫైట్లు చేసేసి వాళ్లని లేపుకొచ్చేసే సీన్లు భలే కామెడీగా అనిపిస్తాయి. ఆ వినయవిధేయరామాలో ఎయిర్ పోర్ట్ నుంచి ట్రైన్‌పైకి దూకే సన్నివేశాల మాదిరిగా ఇందులో కూడా చాలానే ఉన్నాయి.

ఫైటూ పాటా ఫైటూ పాటా ఈ ఫార్మేట్ మాత్రం వదల్లేదు బోయపాటి. కథల్లో ఎక్కడా కనిపించని కొత్తదనం మాత్రం.. హీరోలను లేపడంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. రామ్‌కి ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు. దానికి తగ్గట్టు తమన్ మ్యూజిక్. వీరబాదుడు బాదేశాడు. ఓ లెక్క పత్రం లేకుండా తమన్ కొట్టుకుంటూ పోయాడు తప్పితే సీన్‌ని ఎలివేట్ చేసే విధంగా అయితే లేవు. ఇక పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో తమన్ మ్యూజిక్ ‘స్కంద’లో వర్కౌట్ కాలేదు.

ఇక హీరోయిన్ శ్రీలీలను హీరో యావరేజ్ యావరేజ్ అని ఏడిపిస్తుంటాడు. ‘స్కంద’లో కూడా ఆమె పెర్ఫామెన్స్ జస్ట్ యావరేజ్ మాత్రమే. సీఎం కూతురుగా భారీ బిల్డప్ ఇచ్చినా.. జస్ట్ ఆమెను పాటలకు మాత్రమే పరిమితం చేశారు. రామ్ పక్కన అతని స్పీడ్‌కి మ్యాచ్ అయ్యే హీరోయిన్ లేదని చెప్పాలి. ఆ లోటుని శ్రీలీల తీర్చేసింది కానీ.. యాక్టింగ్ పరంగా జస్ట్ యావరేజ్ మార్కులే. రామకృష్ణ రాజుగా శ్రీకాంత్‌కి మంచి రోల్ పడింది. కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంది. ఒక రకంగా స్కంద కథకి హీరో అతనే. చాలారోజుల తరువాత దగ్గుబాటి రాజా.. హీరోకి తండ్రిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించారు. అయితే ఇతను కూడా నేరుగా సీఎంల ఇంటికెళ్లి.. పచ్చడి జాడీలు ఇచ్చి మరీ వార్నింగ్ ఇచ్చే సీన్ అతిగా అనిపిస్తుంది.
చంద్రబాబుతో బోయపాటికి ఉన్న సాన్నిహిత్యమో.. లేదంటే హీరో రామ్‌కి ఏపీ గవర్నమెంట్‌పై ఉన్న కోపమో తెలియదు ఇన్ డైరెక్ట్‌గా ఏపీ గవర్నమెంట్‌ని బాగానే కోకారు. ‘బూం బూం బీర్లు’పై సెటైర్లు కానీ ‘నిద్రపోతున్నవాడ్ని చంపడం నీకు అలవాటేమో లేపి చంపడం నాకు అలవాటు’, ‘ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే అడ్డం వస్తే లేపాలే ఇప్పుడు సీఎంలు అయినవాళ్లు ఇలా అయినవాళ్లే కదా’ అని హీరో చెప్పే డైలాగ్‌లు ఇన్ డైరెక్ట్‌గా గట్టిగా తగిలేట్టుగానే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలోనూ అంతే స్క్రీన్ మొత్తం ఆర్టిస్ట్‌లే ఉంటారు కానీ ఎప్పటిలాగే సింగిల్ డైలాగ్‌లకే పరిమితం అవుతారు. కొంతమందికి అయితే అసలు డైలాగ్‌లే లేవు. లాజిక్ లేని సీన్లను భరించడమే కష్టం అనుకుంటే తమన్ కొట్టిన రోత బాదుడు భరించడం ఇంకా భారంగా అనిపిస్తుంది. అన్నట్టు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చాడు బోయపాటి. ఫస్ట్ పార్టే సోసోగా ఉంటే ఇక సెకండ్ పార్ట్ అంటే కష్టమే సుమీ. కలెక్షన్ల పరంగా ఢోకా ఉండదు కానీ స్కంద అందరికీ కనెక్ట్ అవ్వడం మాత్రం కష్టం.

Love to Share
Scroll to Top